మద్యం ధరలకు రెక్కలు – ముమ్మిడివరంలో మద్యం ప్రియుల గగ్గోలు


సిండికేట్ల ఇష్టారాజ్యం.. ప్రభుత్వం నిర్ణయం లేకుండానే ధరల పెంపు


పశ్చిమ గోదావరి జిల్లా, ముమ్మిడివరం: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించకపోయినా, ముమ్మిడివరం మండలంలోని మద్యం షాపుల సిండికేట్లు తమకు తామే ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నాయని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం నుంచి ముమ్మిడివరం మండలంలోని మద్యం షాపుల్లో బాటిల్‌పై అనధికారికంగా రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.130 ధర ఉన్న మధ్యరకం బ్రాందీ బాటిల్‌ను రూ.140కి, రూ.190 ఉన్న 190 ఎంఎల్ ఎంసీ బ్రాందీని రూ.200కి, రూ.200 ఉన్న ఎంహెచ్ బ్రాందీని రూ.210కి విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు చెబుతున్నారు. అలాగే 190 ఎంఎల్ రాయల్ స్టాగ్, రాయల్ గ్రీన్ వంటి బ్రాండ్లపైనా అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వం పేదల కోసం తక్కువ ధరకు అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రూ.99 చీప్ మద్యం సీసాను కూడా వదలకుండా రూ.110కు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్పీ ధరలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అకస్మాత్తుగా ధరలు పెరగడంతో “ఎప్పుడు పెరిగింది? ఎవరు పెంచారు?” అంటూ మద్యం ప్రియులు, షాపుల సేల్స్‌మెన్‌ల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో సేల్స్‌మెన్ సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

గత రెండు రోజులుగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బహిరంగంగా మద్యం అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు మౌనంగా ఉన్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాల్సి ఉన్నప్పటికీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై ముమ్మిడివరం ఎక్సైజ్ ఎస్సై ముకురాం ను వివరణ కోరగా, “ఈ విషయం తన దృష్టికి రాలేదని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న షాపులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. మద్యం షాపుల్లో జరుగుతున్న ఈ అక్రమ ధరల అమ్మకాలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.