ఏలూరు జిల్లాలో కొబ్బరి తోటలకు రుగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై ముప్పు – రైతులకు ఉద్యానశాఖ సూచనలు


ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో ప్రస్తుతం రుగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై (తెల్ల దోమ పురుగు) పరిస్థితిపై జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీ కె. సాజా నాయక్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,650 హెక్టార్ల విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుండగా, సంవత్సరానికి సుమారు 222 లక్షల (2.22 కోట్ల) కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతున్నట్టు తెలిపారు.


ప్రస్తుతం వర్షాకాల ప్రభావంతో పాటు వాతావరణ చల్లదనం కారణంగా తెల్ల దోమ పురుగు ఉధృతి తక్కువ స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే రాబోయే మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు మరియు తేమ పెరిగే అవకాశాలు ఉండటంతో, పురుగు ఉధృతి మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రుగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై దాడి వల్ల ఆకుల దిగువ భాగంలో తెల్లని మైనపు పదార్థం ఏర్పడడం, హనిడ్యూ స్రవించడం జరుగుతుందని తెలిపారు. దీని వల్ల ఆకులపై నల్లటి శిలీంధ్రం (సూటీ మోల్డ్) ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గి, చివరకు దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులకు ముందస్తు జాగ్రత్తలు, సమగ్ర పురుగు నియంత్రణ పద్ధతులపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.


పురుగు ఉధృతిని తగ్గించేందుకు రైతులు పలు నివారణ చర్యలు పాటించాలని సూచించారు. ఆకు దిగువ భాగంలో పవర్ స్ప్రేయర్ ద్వారా నీటిని బలంగా పిచికారీ చేయడం, ఎకరానికి 15–20 పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేయడం ద్వారా తెల్ల దోమను నియంత్రించవచ్చన్నారు. అలాగే వేప నూనె 5000 పిపిఎం 5 మిల్లీలీటర్లను ఒక లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగు భాగాలు తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు.

అదేవిధంగా ఈసారియా ఫేమస్వరోజియా వంటి జీవశిలీంధ్రాలను వినియోగించడం, తెల్ల దోమకు సహజ శత్రువులైన ఎంకార్స్య, లేడీబగ్ బీటెల్ వంటి పురుగులు తోటల్లో పెరుగేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులు జిల్లాలోని ప్రతి రైతుకు చేరేలా గ్రామస్థాయిలో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. రైతులు తమ తోటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సూచించిన చర్యలను అమలు చేసి, పురుగు ఉధృతిని నియంత్రించుకోవాలని ఆయన కోరారు.

జిల్లా ఉద్యానశాఖ అధికారి,
ఏలూరు జిల్లా, ఏలూరు.