ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ – 38 ఫిర్యాదుల స్వీకరణ


ఏలూరు, డిసెంబర్ 15 (సోమవారం) : ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ (ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని ఈ రోజు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. సూర్య చంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా పారదర్శకంగా “పేపర్‌లెస్” విధానంలో నిర్వహించారు. ప్రజలు తమ విలువైన సమయం, డబ్బు వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్-డివిజన్ లేదా సర్కిల్ పోలీస్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయదలచిన వారు [https://meekosam.ap.gov.in](https://meekosam.ap.gov.in) వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్-ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ రోజు మొత్తం 38 ఫిర్యాదులు అందగా, వాటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీ అడ్మిన్ గారు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాల్సిందిగా క్రింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఎస్‌ఐ శ్రీమతి వల్లి పద్మ గారు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరిగే విధానాన్ని వివరించి, ఎవరికైనా సైబర్ క్రైమ్ జరిగినట్లయితే వెంటనే 1930 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తమ చుట్టుపక్కల వారికి కూడా సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్య సాయి సేవా సంఘం వారు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అధికారులు తెలిపారు.