ఏలూరు, డిసెంబర్ 15 : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కీర్తిశేషులు స్వాతంత్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించిన గొప్ప గాంధేయవాదిగా గుర్తింపు పొందారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడిగా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూరు జిల్లాలో జన్మించారని, తెలుగు ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడిగా చరిత్రలో నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్ష 58 రోజుల పాటు కొనసాగి, 1952 డిసెంబర్ 15న ఆయన ప్రాణత్యాగానికి దారితీసిందని తెలిపారు. ఆయన త్యాగం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడానికి అంగీకరించగా, 1953లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని వివరించారు.
భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు మూలపురుషుడిగా పొట్టి శ్రీరాములును గుర్తిస్తారని, ఆయన జీవితం ధైర్యం, త్యాగం, పట్టుదలలకు ప్రతీకగా నిలుస్తుందని ఎస్పీ అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన ఈ మహనీయుడు నేటి యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ జి. మునిరాజా, ఆర్‌ఐ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ భాస్కరరావు, ఏఓ షేక్ మస్తాన్, పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















Social Plugin