‘మార్పు’ కార్యక్రమంతో నాటుసారా కుటుంబాలకు నవజీవనం – గౌరవప్రదమైన జీవితం సాగించేలా చర్యలు : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, ఫిబ్రవరి 4: జిల్లాలో నాటుసారా తయారీ నుంచి బయటకు వచ్చిన కుటుంబాలు ‘మార్పు’ కార్యక్రమం ద్వారా కల్పించిన ప్రత్యామ్నాయ ఉపాధిని సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవితం సాగించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.


బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో నవోదయం–2లో భాగంగా ‘మార్పు’ కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్న ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏలూరు జిల్లాను పూర్తిగా నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుంచి బయటకు తీసుకువచ్చి, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామని తెలిపారు.

‘మార్పు’ కార్యక్రమం మొదటి దశలో 40 కుటుంబాలకు రూ.31.40 లక్షలు అందించామని, రెండో విడతలో 26 కుటుంబాలకు రూ.19 లక్షలు రుణాల రూపంలో అందించి, కిరాణా దుకాణాలు, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటు చేయించి ఆర్థిక భద్రత కల్పించామని చెప్పారు. ఈ చర్యల ద్వారా లబ్ధిదారులు తమ కాళ్లపై తామే నిలబడేలా పునరావాస చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జిల్లా యంత్రాంగం తీసుకున్న సమర్థవంతమైన చర్యలు, నిరంతర పర్యవేక్షణ వల్ల జిల్లాలో ఎక్కడా అక్రమ మద్యం, నాటుసారా తయారీకి అవకాశం లేకుండా కుటుంబాలు గౌరవప్రదమైన జీవితం సాగిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. సమస్య మూల కారణాన్ని తొలగించడంతో పాటు, మళ్లీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.

నాటుసారా తయారీ నుంచి బయటకు వచ్చిన కుటుంబాలు మళ్లీ ఆ వృత్తిని చేపడితే వారికి మంజూరు చేసిన రుణాలను రద్దు చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన కుటుంబాలతో ఇకపై నాటుసారా తయారీ చేపట్టబోమని, ప్రభుత్వం అందించిన సహకారంతో గౌరవప్రదంగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సమావేశంలో నాటుసారా తయారీ మానివేసి ప్రత్యామ్నాయ ఉపాధికి అంగీకరించిన 26 కుటుంబాలకు రూ.19 లక్షల రుణాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కలిసి అందజేశారు.

కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన లబ్ధిదారులు తమకు మంజూరైన రుణాలతో ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా సాధించిన అభివృద్ధి, తమ పిల్లల విద్యాభ్యాసం, గౌరవప్రదమైన జీవితం గురించి వివరించారు.