అంతర్జాతీయ ధరకు అనుగుణంగా ఫార్ములా ప్రకటించి కోకో గింజలకు ధర నిర్ణయించాలి.
కోకో గింజలకు గిట్టుబాటు ధర కోసం మరో ఉద్యమం తప్పదు..
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సమావేశం హెచ్చరిక..
ఏలూరు జిల్లా,పెదవేగి/విజయరాయి: కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర పాలసీ ప్రకటించాలని, అంతర్జాతీయ ధరకు అనుగుణంగా ఫార్ములా ప్రకటించి కోకో గింజలకు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని లేకుంటే కోకో గింజలకు గిట్టుబాటు ధర కోసం మరో ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రిటైర్డ్ డిజిపి ఏబీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ హెచ్చరించారు.
ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్ లోని సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈనెల 8,9 తేదీల్లో ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కు, వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేసి ఈనెల 12వ తేదీన జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలకు కోకో రైతుల రాయబార కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ధర ఫార్ములా ప్రకటించి ధర నిర్ణయించి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోకో గింజలు సీజన్ ప్రారంభమైందని మరలా కంపెనీలు సిండికేట్ గా మారి తక్కువ ధర కొనుగోలు చేసి రైతులను నష్టపరిచే ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల ధర సమస్య పరిష్కారం చేయకపోతే మరో కోకో రైతు ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ కు సంబంధించిన కోకో గింజలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ధర పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర ఫార్ములా ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించకుండా కోకో గింజలు కొనుగోలు కంపెనీల ఇస్టా రాజ్యంగా మార్చి వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కిలో కోకో గింజలను ప్రస్తుతం రూ.350 లకు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని, అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉందని చెప్పారు.
ఈనెల 8,9 తేదీలలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి, ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని, ఈనెల 12వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద సామూహిక రాయబార కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్యక్రమాలలో కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, పాలడుగు నరసింహారావు, నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం, ఎన్.దశరథ రామయ్య వివిధ జిల్లాల నుండి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు.

.jpeg)















Social Plugin