ఏలూరు జిల్లా ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా ఆవిష్కరించారు. గురువారం వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం క్యాలెండర్ 2023 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై నిత్యం కృషి చేస్తూ వ్యవసాయంలో మెలుకువలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేయడం అభినందనీయమన్నారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఆయా వ్యవసాయ సంబంధ శాఖల దృష్టికి తీసుకువస్తూ ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా రైతు సంఘం పనిచేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో రైతులు సంఘటితం కావాలని కోరారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు అందేలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం రావాలన్నారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ద్వారా రైతులకు మేలు జరిగేలా మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.
కోకో, కొబ్బరి తదితర పంటల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపరచాలన్నారు. ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలన్నారు. రైతు సంఘం చేస్తున్న కృషిలో జిల్లాలో రైతాంగం భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, ఏపీ ఎమ్ఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.రామ్మోహనరావు, జిల్లా ఉద్యాన అధికారి షాజా నాయక్, జిల్లా పౌర సరఫరాలశాఖ మేనేజర్ శివ శ్రీరామమూర్తి, ఇంకా ఇరిగేషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులకు రైతు సంఘం క్యాలెండర్స్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, నాయకులు గండి రాజా, ఎస్.అప్పారావు, పలువురు రైతులు పాల్గొన్నారు.















Social Plugin