150 ఏళ్ల చరిత్ర గల ఏలూరు జాతరకు లక్షలాది భక్తులు : మేయర్ నూర్జహాన్ పెదబాబు


తూర్పు వీధి అమ్మవార్లకు చీర–సారే సమర్పించిన ఏలూరు మేయర్ కుటుంబం


ఏలూరు జిల్లా, ఏలూరు: 150 సంవత్సరాల చరిత్ర కలిగి, దేశవ్యాప్తంగా పేరుపొందిన ఏలూరు జాతరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్–ఎస్.ఎం.ఆర్. పెదబాబు తెలిపారు. గ్రామ దేవతలను దర్శించుకుని అమ్మవార్ల అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని చెప్పారు.

ఏడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో గ్రామ ఆడపడుచులైన శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మలకు పుట్టింటి సారే సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని మేయర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూర్పు వీధి అమ్మవార్లకు మేయర్ నూర్జహాన్ పెదబాబు కుటుంబ సభ్యులు చీర–సారే సమర్పించినట్లు తెలిపారు.

మేయర్ మాట్లాడుతూ వంద రోజుల పాటు నిర్వహించిన జాతర మహోత్సవ కార్యక్రమాలు ప్రస్తుతం ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయని అన్నారు. గ్రామ దేవతలను కొలిచేందుకు భక్తులు తమ శక్తి కొలదీ చీరలు, సారెలు, పిండి వంటలు, పండ్లు తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించి ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు.

మహిళలు ధూప దీప నైవేద్యాలు, కుంకుమ పూజలు, పారాయణాలు, కోలాట నృత్యాల ద్వారా అమ్మవార్లను శాంతింపచేసి తృప్తిపరుస్తున్నారని చెప్పారు. ఈ రోజు తూర్పు వీధి అమ్మవార్లకు మరియు ఘటాలకు మొక్కుబడులు తీర్చుకున్నామని మేయర్ తెలిపారు.

తానంకి సాయి సహకారంతో తూర్పు వీధి పాత గంగానమ్మ ఆలయానికి పూలతో చేసిన అలంకరణ, పూజా కార్యక్రమాలు కనులవిందుగా ఉన్నాయని మేయర్ అన్నారు. యడ్లపాటి రాము ఇంటి వద్ద నుంచి బయలుదేరిన ఘటాలను దర్శించుకుని అమ్మవారికి నీళ్ల స్నానం చేయించి మొక్కులు తీర్చుకున్నామని వివరించారు. గ్రామ దేవతలైన అమ్మవార్లు ఏలూరు ప్రజలందరికీ సుభిక్షం, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.

అలాగే ఏలూరు పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుంచి నిర్వహించిన సారే సమర్పణ కార్యక్రమంలో కూడా తాను పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు వీధి జాతర కమిటీ అధ్యక్షులు వంకినేని భాను ఆధ్వర్యంలో మేయర్ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు సురేష్, జాతర కమిటీ సభ్యులు భగవాన్ తదితరులు మేయర్ వెంట పాల్గొన్నారు.