ట్రామా కేర్ సౌకర్యాలు విస్తరించాలి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్


ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 05: ఏలూరు జిల్లా ఆసుపత్రి సహా రాష్ట్రంలో 14 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర ట్రామా చికిత్స కేంద్రాలు నడుస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ వెల్లడించారు. ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సౌకర్యాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో ఆయన సమాధానం ఇచ్చారు. 


రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించే మరణాల సంఖ్యను తగ్గించటం కోసం, ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ట్రామా కేర్ నెట్వర్క్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న కేంద్ర మంత్రి, 11వ మరియు 12వ పంచవర్ష ప్రణాళికల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం నిధులు కేటాయించిందన్నారు. 

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 196 చోట్ల ట్రామా కేర్ ఫెసిలిటీస్ (TCF) మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 92 కోట్లతో 14 ట్రామా కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో ఏలూరు జిల్లా ఆసుపత్రి కూడా ఉందన్నారు. ఈ సెంటర్లలో చికిత్స అంతా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఆయితే, కొత్త ట్రామా కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో లేదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడించారు.