అనన్య విద్యాసంస్థల్లో ఘనంగా నూతన సంవత్సరం 2026 వేడుకలు – కుటుంబ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్


లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో అనన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026కు స్వాగతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ కుటుంబ సమేతంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో పాఠశాల యాజమాన్యం, చిన్నారులు ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా అనన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వతంత్ర సమరయోధుల వేషధారణలు, జానపద నృత్యాలు, ఆలోచింపజేసే కోలాట భజన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అనంతరం విద్యార్థులు మ్యాగ్నస్ సొంగా, మార్వల్ సొంగాలతో కలిసి ఎమ్మెల్యే దంపతులను, కూటమి నాయకులను వేదికపైకి ఆహ్వానించి చిరు సందేశాలు అందించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, కూటమి నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఇప్పటినుంచే తమ జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవాలని, ఒక పొడుపు కథ ద్వారా స్పష్టంగా వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను వారి లక్ష్య దిశగా ముందుకు నడిపించే బాధ్యత వహించాలని సూచించారు.


హైటెక్ ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఆయనకు చేదోడువాదోడుగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, అలాగే విద్యా వ్యవస్థకు మహర్దశ తీసుకువచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రతి విద్యార్థి హైటెక్ విద్యార్థిగా ఎదుగుతున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) మధ్య తేడాను సులభంగా వివరించారు.

అనంతరం నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం ముగింపులో అనన్య విద్యాసంస్థల యాజమాన్యం ఎమ్మెల్యే దంపతులకు ఘన సన్మానం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనన్య విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.