విదేశీ కోకో గింజలు,కోకో ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచాలి.
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో అమరావతి లోని సీఎంఓ లో కోకో రైతులు వినతి..
ఏలూరు జిల్లా, ఏలూరు: కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని, అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, కోకో గింజలు, కోకో ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచి దేశీయంగా రైతులకు ధర పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అమరావతి రాష్ట్ర సచివాలయం సీఎంఓలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
అనంతరం సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ డిజిపి ఎ.బి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, బోళ్ళ వెంకట సుబ్బారావు, కోనేరు సతీష్ బాబు, మున్నంగి సుబ్బారెడ్డి మాట్లాడారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఇవ్వకుండా ధరలు తగ్గించి వేసి రైతులను మోసగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మన దేశ అవసరాలకు కావలసిన కోకో గింజలు 20% మాత్రమే దేశంలో ఉత్పత్తి జరుగుతున్నదని, 80% కోకో గింజలు,కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నామని వివరించారు. కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు నామమాత్రంగా ఉండడం వలన విదేశీ కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుని దేశీయంగా రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం లేదని చెప్పారు.
కోకో దిగుమతులపై దిగుమతి సుంకాల పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయిస్తున్న విధంగా కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ధర పాలసీ లేకపోవడంతో కంపెనీల ఇస్టా రాజ్యంగా మారిందని చెప్పారు.
కోకో గింజలకు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేసిన ఫలితంగా గత ఏడాది రూ.500 కోట్లు రైతులు నష్టపోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రూ.50 ప్రోత్సాహం అందించి కిలో కోకో గింజలకు రూ.500 ధర కల్పించారని లేకపోతే కోకో రైతులు మరింతగా నష్టపోయేవారని చెప్పారు.
ఈ సంవత్సరం ఈ నెల నుండి సీజన్ ప్రారంభమైందని ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉండగా కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి గత రెండు రోజుల నుండి రూ.400 లకు రైతుల ఆందోళనతో ధర పెంచారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
దేశంలో అత్యధిక కోకో పంట సాగు విస్తీర్ణంలో, కోకో గింజలు మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని, రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఫలితంగా కోకో రైతులకు మేలు జరుగుతుందని ఆదిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించాలి. https://t.co/ndO7GhycsJ
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026















Social Plugin