స్పౌజ్ పెన్షన్లకు తొలి ప్రాధాన్యత : ఎమ్మెల్యే బడేటి చంటి


పేదల సొంతింటి కల సాకారం చేస్తాం – ప్రజాదర్బార్‌లో హామీ


ఏలూరు, జనవరి 9: ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత పరిష్కారం అందించడమే తమ ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజల మన్ననలు పొందుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్పౌజ్ పెన్షన్ల మంజూరుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అవసరమైన అర్హులకు ఇతర సామాజిక భద్రతా పెన్షన్లను కూడా వర్తింపజేస్తామని వెల్లడించారు. అలాగే పేదల సొంతింటి కలను సాకారం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, ఆయా సమస్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, పార్టీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నగర నాయకులు, క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, డివిజన్ ఇన్‌ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.