ఏలూరు జిల్లాలో ఓఎన్జిసి సీఎస్ఆర్ నిధులతో ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌ల ప్రారంభం


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లాలోని 7 కళాశాలలు, 4 పాఠశాలల్లో ఓఎన్జిసి సంస్థ రూ.2.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌లను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరులో రూ.2 కోట్లతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుని ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవచ్చని, తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుత సమాచార సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఐటీ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు పూర్తిగా సమాచార సాంకేతిక రంగానిదేనని, ముఖ్యంగా ఏఐ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నతస్థాయి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు ద్వారా యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎంపీ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యే ప్రధాన మార్గమని అన్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ఆసక్తితో చదవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం అత్యవసరమని, పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలని అన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయిన పుట్టా మహేష్ కుమార్ ఏలూరు ఎంపీ కావడం నియోజకవర్గానికి అదృష్టమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశంసించారు. రైల్వే, రోడ్డు, విమాన రవాణా సౌకర్యాలు ఉన్న ఏలూరును సాఫ్ట్‌వేర్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటుకు చొరవ చూపాలని ఎంపీని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐడీఏ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఓఎన్జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యప్రసాద్, ఓఆర్సీసీ పీడీ బండారు నిహా, తహసీల్దార్ గాయత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజ్ కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.