ఏలూరు జిల్లా, ఏలూరు: మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులందరికీ వారికి అందవలసిన అన్ని బెనిఫిట్స్‌ను సమయానికి అందిస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సూచనల మేరకు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన నాలుగవ శ్రేణి ఉద్యోగులకు యూనిఫామ్స్ పంపిణీ చేసినట్లు మేయర్ తెలిపారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పబ్లిక్ హెల్త్ వర్కర్లు, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, పరిపాలన విభాగానికి చెందిన నాలుగవ తరగతి ఉద్యోగులు, పీహెచ్ మేస్త్రిలు, డ్రైవర్లు, ఎంఎన్ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు, ఆయాలు తదితరులు కలిపి మొత్తం 296 మందికి రెండు సంవత్సరాల యూనిఫామ్‌ను మేయర్ చేతుల మీదుగా అందజేశారు.
మగ ఉద్యోగులకు రెండు జతల యూనిఫామ్‌లు, మహిళా ఉద్యోగులకు మూడు జతల యూనిఫామ్‌లు, ప్రతి ఉద్యోగికి మూడు టవల్స్ అందజేశామని మేయర్ వివరించారు. నాలుగవ తరగతి ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఏలూరు నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, నగరం పరిశుభ్రంగా ఉండేందుకు పబ్లిక్ హెల్త్ వర్కర్లు అందిస్తున్న సేవలు మరువలేనివని మేయర్ షేక్ నూర్జహాన్ కొనియాడారు. వారి కృషికి నగరపాలక సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఏ. భాను ప్రతాప్ మాట్లాడుతూ, నాలుగవ తరగతి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు, ఏరియర్లు, పదోన్నతులు ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డి. శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ బి. శివారెడ్డి, మేనేజర్ మూర్తి, సూపర్నెండెంట్ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, వంకదారు ప్రవీణ్, సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగవ తరగతి ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ సమయానికి అందజేస్తున్నాం : మేయర్ షేక్ నూర్జహాన్ https://t.co/YXGXHBy3yN
— ELURU NEWS (@EluruNews90170) January 7, 2026















Social Plugin