కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలి.
కోకో పంట పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..
విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచాలి.
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కోకో రైతులు వినతి..
కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..
కోకో రైతులకు ఎంపీ హామీ..
ఏలూరు జిల్లా, ఏలూరు: కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని, అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
గురువారం ఎంపీ నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ప్రతినిధి బృందంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోకో రైతుల సమస్యలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో కోకో గింజలకు ధర పాలసీ లేకపోవడంతో కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నాయని సంఘ నాయకులు ఆరోపించారు. మన దేశ అవసరాలకు కావలసిన కోకో గింజల్లో కేవలం 20 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరుగుతుండగా, మిగిలిన 80 శాతం కోకో గింజలు, కోకో ఉత్పత్తులు విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయని వివరించారు.
విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు నామమాత్రంగా ఉండడం వల్ల కంపెనీలు విదేశీ కోకోను దిగుమతి చేసుకుని దేశీయ రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం లేదని చెప్పారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయిస్తున్న విధంగా కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ధర ఫార్ములా రూపొందించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ధర పాలసీ లేకపోవడం వల్ల కంపెనీల ఇష్టారాజ్యంగా వ్యవహారం సాగుతోందని తెలిపారు.
కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేసిన ఫలితంగా కోకో రైతులు సుమారు రూ.500 కోట్ల వరకు నష్టపోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలోకు రూ.50 ప్రోత్సాహం అందించి కోకో గింజలకు రూ.500 ధర కల్పించడంతో రైతులు కొంతమేర ఉపశమనం పొందారని తెలిపారు.
ఈ నెలతో కోకో సీజన్ ప్రారంభమైందని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కోకో గింజలకు రూ.550కు పైగా ధర ఉన్నప్పటికీ కంపెనీలు మొదట రూ.350కు మాత్రమే కొనుగోలు ప్రారంభించాయని తెలిపారు. రైతుల ఆందోళనతో గత రెండు రోజులుగా ధరను రూ.400కు పెంచారని, అయినా అంతర్జాతీయ ధరకు చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోనే ఏలూరు జిల్లాలో అత్యధిక కోకో పంట విస్తీర్ణం ఉన్నదని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల కోకో రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజల ధర ఫార్ములా రూపొందించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు తదితరులు, పలువురు కోకో రైతులు పాల్గొన్నారు.
కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలి : ఏలూరు ఎంపీకి కోకో రైతుల వినతి https://t.co/bVden8AD8d
— ELURU NEWS (@EluruNews90170) January 8, 2026















Social Plugin