కూటమి విజయంలో కష్టించిన ప్రతి కార్యకర్తకూ న్యాయం
— డిప్యూటీ మేయర్‌గా కర్రి శ్రీనివాసరావు ఎన్నిక: ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు జిల్లా, ఏలూరు: గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి గెలుపు కోసం కష్టించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే తన దృఢ సంకల్పమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన కార్యకర్తలకు పదవులు దక్కేలా నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
ఈ క్రమంలో గతంలో బహిరంగంగా ప్రకటించినట్లుగానే 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావును ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఏడాది కాలంగా డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఆ పదవికి కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించగా, మిగిలిన కౌన్సిల్ సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ దుశ్శాలువాలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి విశేషంగా కృషి చేసిన వారికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. భవిష్యత్తులో కర్రి శ్రీనివాసరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావు అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగరాభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు.
డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ నగర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, టిడిపి నాయకులు బెల్లపుకొండ కిషోర్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు.

















Social Plugin