ఏలూరు జిల్లా, ఏలూరు: వాహనాల తాత్కాలిక నమోదు (Temporary Registration – TR) పేరుతో అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు హెచ్చరించారు. గురువారం ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో టీఆర్ ఛార్జీలపై వాహన డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీటీసీ కృష్ణారావు మాట్లాడుతూ వాహనాల తాత్కాలిక నమోదు సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలను మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చేయాలని సూచించారు. అదనపు లేదా అనధికార వసూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని స్పష్టం చేశారు.
ప్రతి వాహన షోరూంలో టీఆర్ ఛార్జీలు, ఇతర రుసుముల వివరాలను స్పష్టంగా చూపించే బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. రవాణా కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఈ మేరకు టీఆర్ ఛార్జీల జాబితాను డీలర్లకు అందజేశారు.
తాత్కాలిక నమోదు సమయంలో అధిక వసూళ్లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయని పేర్కొన్న డీటీసీ, అలాంటి ఫిర్యాదులను గణనీయంగా తగ్గించే దిశగా ప్రతి డీలర్ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అన్ని షోరూంలలో ఫీజు వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయని డీలర్లపై, అలాగే అధిక ఫీజులు వసూలు చేసే వారిపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆర్టీవో (ఇంచార్జ్) ఎస్.బి. శేఖర్, మోటార్ వాహన ఇన్‌స్పెక్టర్లు బి. భీమారావు, జి. ప్రసాదరావు, పి. రమేష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. రాము, ఎం. ఆనంద్ కుమార్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మంది వాహన డీలర్లు పాల్గొన్నారు.
టీఆర్ పేరుతో అధిక వసూళ్లు చేస్తే కఠిన చర్యలు : డీలర్లకు డీటీసీ కృష్ణారావు హెచ్చరిక https://t.co/sUTnexGetf
— ELURU NEWS (@EluruNews90170) January 8, 2026















Social Plugin