యువతకు ఆదర్శప్రాయుడు నారా లోకేష్
— కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం / కొత్తపేట, జనవరి 23: కృషి, పట్టుదలతో తనను తాను నిరూపించుకుని, తనను విమర్శించిన వారిచేతే “శభాష్” అనిపించుకున్న నవ యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేటి యువతకు ఆదర్శప్రాయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, అనేక మంది యువత రక్తదానం చేశారు. పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులంతా కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ.. 2009లో పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుని కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచిన నారా లోకేష్ ఎన్నో రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రత్యర్థుల అవహేళనలు, అవమానాలు, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా వాటికి మాటలతో కాకుండా తన పనితీరుతో సమాధానం చెప్పారని అన్నారు.
తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి కార్యాచరణ చేపట్టారని తెలిపారు.
పార్టీ అధినేతగా ఎక్కడినుంచైనా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఎన్నడూ గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకుని పట్టుదలతో విజయం సాధించారని, ఒకసారి పరాజయం తర్వాత రెండోసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలలో ఒకటిగా గెలిచి తన సత్తా చాటారని అన్నారు.
మంత్రిగా తనకు నచ్చిన శాఖను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, బాధ్యతతో కూడిన విద్యాశాఖను ఎంచుకుని విద్యా ప్రమాణాలు పెంచుతూ, ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులను తనదైన శైలిలో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్‌కే దక్కుతుందని, అలాగే ఉపాధి అవకాశాల కల్పన కోసం అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. పుట్టినరోజు వేడుకలను పక్కనపెట్టి కూడా తండ్రి నారా చంద్రబాబు నాయుడు, కుమారుడు నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోస్‌లో పెట్టుబడుల ఆకర్షణలో నిమగ్నమై ఉండడం ఆయన అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.
ఇదే సందర్భంలో కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద కనకదుర్గమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాల్లో కంఠం శెట్టి శ్రీను ఆధ్వర్యంలో నారా లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రావులపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి నాయకులు, నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.















Social Plugin