అన్నే వెంకటేశ్వరరావు ఆశయాల సాధనకే నిజమైన నివాళులు : ఎ. రవి


ఏలూరు జిల్లా, ఏలూరు: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, జిల్లా రైతు–వ్యవసాయ కార్మిక ఉద్యమాల నిర్మాత అమరజీవి అన్నే వెంకటేశ్వరరావు ఆశయాల సాధనకే అందరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. రవి పిలుపునిచ్చారు.


బుధవారం ఏలూరు యూటిఎఫ్ భవనంలో అన్నే వెంకటేశ్వరరావు 23వ వర్ధంతి సభను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అన్నే వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎ. రవి మాట్లాడుతూ, జిల్లా మెట్ట ప్రాంతంలో జరిగిన అనేక భూ పోరాటాలకు అన్నే వెంకటేశ్వరరావు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని, జిల్లాలో రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ ఉద్యమాల సందర్భంలో 14 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన ధీరోధాత్తుడిగా ఆయనను కొనియాడారు.

అన్నే వెంకటేశ్వరరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళులని పేర్కొన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అన్నే స్ఫూర్తితో ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్. లింగరాజు, జిల్లా కార్యదర్శి డి.ఎన్.వి.డి. ప్రసాద్, ఎ.వి.ఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు హైమావతి, కార్యదర్శి శ్యామలారాణి, యూటీఫ్ జిల్లా కార్యదర్శి రవి కుమార్, సిపిఎం నగర కార్యదర్శి పంపన రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.