పెదవేగి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి చట్టాలపై అవగాహన


ఏలూరు జిల్లా పెదవేగి: పెదవేగి గ్రామంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సామాజిక చైతన్యం కల్పించేందుకు గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెదవేగి ఎస్ఐ హరి గోపాల్ పోలీస్ సిబ్బందితో కలిసి నిర్వహించారు.


ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో పెదవేగి మండలం, పెదవేగి గ్రామంలో గ్రామ సభ నిర్వహించబడింది.

ఈ సభలో గ్రామ ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, మైనర్ బాలికలపై జరిగే అఘాయిత్యాల నివారణకు సంబంధించిన పోక్సో యాక్ట్ గురించి వివరించారు. అలాగే సైబర్ నేరాల నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

డ్రగ్స్, మద్యం దుర్వినియోగంపై ప్రభుత్వ చర్యలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో సమాజాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

గ్రామస్తులు ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొని, వివిధ అంశాలపై పోలీస్ అధికారులను సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలైన కోడిపందాలు, పేకాట నిర్వహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హరి గోపాల్ గారు హెచ్చరించారు.

అటువంటి కార్యకలాపాలపై సమాచారం డయల్ 112కు లేదా ఎస్ఐ గారి ఫోన్ నెంబర్ 9440796638 కు అందిస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ హామీ ఇచ్చారు.