మహిళా భద్రతపై శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన శక్తి టీం


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర ఆధ్వర్యంలో శక్తి టీం సభ్యులు మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సత్రంపాడు గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో జరిగింది.


ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు పబ్లిక్ ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం శక్తి టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, శక్తి యాప్ ఉపయోగాలపై మైక్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళలు, బాలికలు అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.

శక్తి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిన మహిళా భద్రతకు సంబంధించిన అత్యవసర స్పందన మొబైల్ అప్లికేషన్ అని తెలిపారు. ఏదైనా ప్రమాదకర లేదా అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా అలర్ట్ పంపినా లేదా డయల్ 112కు సమాచారం ఇచ్చినా, సమీపంలోని శక్తి టీం గస్తీ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటుందని తెలియజేశారు.

ఈ యాప్ ద్వారా మహిళలు రాత్రి వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మరింత భద్రతగా భావించవచ్చని అన్నారు. అలాగే మహిళల హక్కులు, సంబంధిత చట్టాలు, పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్లు, సైబర్ నేరాలు, వేధింపులు, హరాస్మెంట్ వంటి అంశాలపై కూడా అవగాహన పొందవచ్చని వివరించారు.

శక్తి యాప్‌లో 112 ఎమర్జెన్సీ నెంబర్, 181 మహిళా హెల్ప్‌లైన్ వంటి నెంబర్లను నేరుగా కాల్ చేసే సౌకర్యం ఉందని, ఫ్రెండ్ ట్రాకింగ్ / సేఫ్టీ షేరింగ్ ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో లైవ్ లొకేషన్ పంచుకోవచ్చని తెలిపారు. దీంతో వారు మీ ప్రయాణాన్ని గమనించవచ్చని చెప్పారు.

వేధింపులు, కిడ్నాప్ ప్రయత్నాలు, గృహ హింస, రహదారిలో ఒంటరిగా ప్రయాణం, అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తన వంటి సందర్భాల్లో శక్తి యాప్ ఎంతో ఉపయోగకరమని శక్తి టీం సభ్యులు పేర్కొన్నారు. శక్తి యాప్ మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే సాధనమని, మహిళలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండేందుకు పోలీస్ శాఖ తీసుకున్న అద్భుతమైన చర్య అని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రానికి వచ్చిన అభ్యర్థుల ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఉపయోగించే విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ప్రతి మహిళ తన మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ తప్పనిసరిగా ఉంచుకోవాలని శక్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు.