స్వతంత్ర భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలి – మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు


ఏలూరు, జనవరి 26 : ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు గాంధీజీ విగ్రహానికి నూలు మాల వేసి ఘన నివాళులు అర్పించగా, మున్సిపల్ కమిషనర్ ఏ. భాను ప్రతాప్ జాతీయ జెండాను ఆవిష్కరించి గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం వారు ఇరువురు మాట్లాడుతూ, ఎందరో త్యాగదనుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రచించబడిన భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించబడిందని, ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి 26 అని తెలిపారు.

మేయర్ మాట్లాడుతూ, దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం అంకితభావంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రి స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యంగా యువత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్–2040తో కలిసి ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా మేయర్ యువతను కోరారు.

ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కలిసి సమన్వయంతో పనిచేస్తూ ప్రజలు హర్షించే విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 18 నెలల కాలంలో వివిధ రకాల గ్రాంట్ల ద్వారా రూ.500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మేయర్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డి. శ్రీనివాస్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, తంగెళ్ల రాము, కో-ఆప్షన్ సభ్యులు జాల సుమతి బాలాజీ, సూపరింటెండెంట్ రాజుద్దీన్, డీఈ అప్పలరాజు, ఏఈ సాయి, పీఓ మహాలక్ష్మి, అకౌంటెంట్ లింగేశ్వరి, ఆర్వోలు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.