వైసీపీ విద్యుత్‌ ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచింది : ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు జిల్లా, ఏలూరు: విద్యుత్‌ ఛార్జీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తీవ్రంగా మండిపడ్డారు. ఆ దుర్మార్గ పాలన ఛాయల్ని పూర్తిగా తుడిచేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని తగ్గించే నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.


ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి, విద్యుత్‌ సంస్కరణల అమలులో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వివరించారు. గతంలో డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్‌ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

2014–19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. అయితే 2019–24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి, నియంత్రణ లేకుండా వినియోగించడంతో విద్యుత్‌ రంగాన్ని నాశనం చేసిందన్నారు. దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్‌ బిల్లులు పెంచి ప్రజలను తీవ్రంగా పీడించిందని విమర్శించారు.

2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తోందని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిస్కంలకు చెల్లించాల్సిన సుమారు రూ.4,498 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలను ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించడంతో ప్రజలకు భారీ ఉపశమనం లభించిందన్నారు. అలాగే యూనిట్‌ విద్యుత్‌ ఛార్జీలను తగ్గించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విద్యుత్‌ కొనుగోలు వ్యయం తగ్గించడం, ఛార్జీల భారాన్ని నియంత్రించడం దిశగా కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్ధసారధి, డిప్యూటీ మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్‌.ఎం.ఆర్‌. పెదబాబు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.