సంక్రాంతి సందర్భంగా చాట్రాయిలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం


ఏలూరు జిల్లా, చాట్రాయి: రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ప్రారంభించారు.


ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యం గ్రామ యువతను పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచి, క్రీడల వైపు మళ్లించడం అని అధికారులు పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలు యువతను ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సహించడంలో కీలకంగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు అత్యంత అవసరమని అన్నారు. పండుగల సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని వివరించారు.

గ్రామస్థులు పోలీస్ శాఖ చేపట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ, యువతకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీస్ అధికారులు వెల్లడించారు.