ఏలూరు తూర్పువీధి గంగమ్మ తల్లి జాతరకు పటిష్ట ఏర్పాట్లు
— భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్..
ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు నగరం తూర్పువీధిలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రసిద్ధ శ్రీ గంగమ్మ తల్లి జాతరను భక్తులు ప్రశాంతంగా, భద్రంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అధికారులను ఆదేశించారు.
జాతర నిర్వహణకు సంబంధించి గురువారం ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ పరిసరాలు, ఊరేగింపు మార్గాలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున, తోపులాటలు జరగకుండా క్యూలైన్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అమ్మవారి ఊరేగింపు సమయంలో నగరంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులకు ఎస్పీ సూచించారు. జాతర కమిటీ సభ్యులు, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలతో పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. భక్తుల కోసం అత్యవసర వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని అన్నారు.
జాతర ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించాలని, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ స్పష్టం చేశారు. భక్తులు మరియు జాతర కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకొని పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దక్షిణపు వీధిలో గంగమ్మ జాతర జరిగే ప్రాంతాలను కూడా పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
















Social Plugin