ఏలూరు, జనవరి 30: అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యతను పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుంచి అక్షర ఆంధ్ర, యూనిఫైడ్ ఫామిలీ సర్వే, పీ4 తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో 97,200 మందికి అక్షరాస్యతతో పాటు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత అందించడం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభ్యాసకుల వివరాలను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది శనివారం నాటికి యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, డీఆర్‌డీఏ, డ్వామా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే యూనిఫైడ్ ఫామిలీ సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
పీ4 కార్యక్రమంపై మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలను పీ4 యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బంగారు కుటుంబాలకు అవసరమైన చేయూతను మార్గదర్శులతో అనుసంధానం చేసి, సంబంధిత వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఎంపీడీఓలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.















Social Plugin