37వ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు – లోకుముడిలో డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం


ఏలూరు జిల్లా,మండవల్లి: ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 37వ రహదారి భద్రత మాసోత్సవాల చివరి రోజు సందర్భంగా మండవల్లి మండలం లోకుముడి దత్తాత్రేయం గ్రామంలో రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమం ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వ్యాన్లు, లారీ డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల వల్ల అత్యధికంగా 30 సంవత్సరాల లోపు యువత మరణాలకు గురవుతున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన యువత ప్రాణాలు కోల్పోవడం వల్ల కుటుంబాలతో పాటు దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్వకేట్ ఉదయ శంకర మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుడ్ సమారిటన్ విధానాన్ని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సహాయం చేసిన వారికి రూ.5,000 నగదు బహుమతి, రెండు సార్లు సహాయం చేసిన వారికి రూ.25,000, సంవత్సరంలో ఉత్తమ సేవలందించిన వారికి రూ.1,00,000 బహుమతి అందజేస్తారని తెలిపారు. అలాగే సహాయం చేసిన వారిని పోలీస్ దర్యాప్తులో ఎటువంటి ఇబ్బందులకు గురి చేయబోమని స్పష్టం చేశారు.

యునైటెడ్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ, నూతన చట్టాల ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ప్రభుత్వము అందజేస్తుందని వివరించారు.

కైకలూరు నియోజకవర్గ పరిధిలో చాలామంది చేపల చెరువులను జీవనోపాధిగా చేసుకుని చాపల రవాణా సమయంలో వాహనాలపై కూర్చుని ప్రయాణిస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహన యజమానులు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మండవల్లి మండలం పరిధిలోని అన్ని వాహన డ్రైవర్లతో కలిసి ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ తెలిపారు. ఈ గ్రూపు ద్వారా డ్రైవర్లకు ఎప్పటికప్పుడు రహదారి భద్రతకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఆదేశాలు పంపిస్తామని చెప్పారు.

లోకుముడి డాక్టర్ జోషిమా మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (మొదటి ఒక గంట) లో వైద్య సహాయం అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిపారు. అలా సహాయం చేయడం ద్వారా బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచినవారవుతారని అన్నారు.

హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అధికారులు వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాపాయం నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. యువత ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లోకుముడి డాక్టర్ జోషిమా, యునైటెడ్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుధీర్, మండవల్లి ఎస్‌ఐ శ్రీ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.