ఏలూరులో నూతన పోలీస్ విశ్రాంతి భవనం ప్రారంభం
ఎంపీ ల్యాడ్ నిధులు రూ.65 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలు
ఏలూరు, జనవరి 24: ఏలూరు జిల్లా పోలీసుల సంక్షేమమే లక్ష్యంగా, ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలో మహిళలు, పురుష పోలీసుల కోసం నిర్మించిన నూతన పోలీస్ విశ్రాంతి భవనాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ నిధుల నుంచి రూ.65 లక్షలు వెచ్చించి ఈ భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు.
ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విధుల నిమిత్తం ఏలూరు వచ్చే పోలీస్ సిబ్బంది, అధికారులకు ఈ విశ్రాంతి భవనం ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, అన్ని వసతులతో ఈ భవనాన్ని రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల శాంతిభద్రతల కోసం 24 గంటలూ అంకితభావంతో పనిచేస్తున్న పోలీస్ శాఖకు తన వంతు సహకారం అందించడం గర్వకారణమని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి విధుల నిమిత్తం వచ్చే పోలీసులకు విశ్రాంతి కోసం సౌకర్యవంతమైన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీ ల్యాడ్ నిధులను మంజూరు చేశామని చెప్పారు. భవన నిర్మాణాన్ని నిబద్ధతతో పూర్తి చేసిన జిల్లా ఎస్పీ ని మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణానికి సహకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. పణి భూషణ, డిప్యూటీ ఇంజనీర్ వి. సుధాకర్, కాంట్రాక్టర్ శాఖ ప్రతినిధులను జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు దుస్సాలువలతో సత్కరించారు.
భవన నిర్మాణానికి సహకరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి పోలీస్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐ సతీష్, ఏలూరు 1, 2, 3 టౌన్ ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, అశోక్ కుమార్, కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు, పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు సహా పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.















Social Plugin