స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొనడం


స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొనడం
క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్‌లో స్వయంగా చెత్త తొలగింపు


ఏలూరు, జనవరి 24: ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్‌లో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ శనివారం స్వయంగా పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తమ సిబ్బందితో కలిసి పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి, పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఏలూరు 3 టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు 3 టౌన్ ఎస్‌ఐలు రాంబాబు, అప్పారావు తదితర పోలీస్ సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మన చుట్టూ నివసించే మరియు పని చేసే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటిస్తే అనేక రోగాల నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. నివాస, కార్యాలయ ప్రాంతాల్లో పరిశుభ్రత లోపిస్తే మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పరిశుభ్రమైన వాతావరణంలో నివసిస్తూ, పనిచేస్తూ, పిల్లలు చదువుకుంటే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంటు వ్యాధులు లేని ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.

ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది ప్రజలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ గారు హితవు పలికారు.