ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు టౌన్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలను ఏలూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ రావు తన సిబ్బందితో కలిసి నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 15 మంది వాహనదారులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించిన 15 మందిని సోమవారం (19-01-2026) గౌరవ న్యాయమూర్తి గారి ఎదుట హాజరుపరిచారు. కోర్టులో హాజరు పరిచే ముందు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ రావు నిందితులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ రావు మాట్లాడుతూ, “మద్యం సేవించి వాహనం నడపడం అంటే కేవలం మీ ప్రాణాలనే కాదు, రోడ్డుపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయడమే. క్షణిక ఆనందం కోసం చేసే ఇటువంటి చర్యలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి” అని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారి భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని వారు కోరారు.















Social Plugin