ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సభ్య సమాజం తలదించుకునే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు దిష్టిబొమ్మను మైలవరం నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపు మేరకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాజకీయ నాయకుడిగా ఉండి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం సమాజానికి హానికరమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తాయని, అంబటి రాంబాబును చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుని ముసుగులో కుట్రపూరితంగా మాట్లాడే వారు వైసీపీలో అనేకమంది ఉన్నారని విమర్శించారు.
ఏడు పదుల వయస్సులోనూ నవ్యాంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి నోటి దురుసుతో వ్యవహరించే వారిని నియంత్రించేందుకు కఠిన చట్టాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, పబ్లిసిటీ కోసం హద్దులు దాటుతూ మాట్లాడే నాయకులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin