ఆగిరిపల్లిలో శ్రీ దుగ్గిరాల బాల రావమ్మ మాఘ పౌర్ణమి తిరుణాళ్లు అంగరంగ వైభవం


ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి:
ఆగిరిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ దుగ్గిరాల బాల రావమ్మ అమ్మవారి మాఘ పౌర్ణమి తిరుణాళ్ల మహోత్సవాలు శనివారం మూడవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగింది.

ఉదయమే అమ్మవారికి పంచామృత ఫలాభిషేకం, స్నపన అభిషేకం, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామావళి, సామూహిక మార్ఛన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పుల్లయ్య చేతుల మీదుగా నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.

ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పాలు పొంగలి, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 6 గంటలకు మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ యువసేన ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు.

పూజా కార్యక్రమాలు, గ్రామోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదే విధంగా మండల పరిధిలోని తోటపల్లి, కనసనపల్లి గ్రామాలలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ బాల రావమ్మ అమ్మవారికి కూడా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా గ్రామోత్సవం జరిపారు.