చనిబండ / సూరంపాలెం, జనవరి 26 : భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని చనిబండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చనిబండ సచివాలయం, జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలోతో పాటు సూరంపాలెం బాపట చెరువు వద్ద వికసిత్ భారత్ ఉపాధి హామీ పథకం (VB GRAM G) కింద నిర్మించిన అమృత సరోవరం వద్ద భారత త్రివర్ణ జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. భారతదేశ ప్రజలు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పటికి సొంత రాజ్యాంగం లేదని గుర్తు చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన సుమారు రెండు సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల పాటు కఠినమైన శ్రమ అనంతరం భారత రాజ్యాంగం రూపొందించబడిందని తెలిపారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చి భారతదేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు.
గణతంత్రం అంటే రాజులు, రాణులు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ అని వివరించారు. ప్రజలే పాలకులను ఎన్నుకునే హక్కు కలిగిన ఈ రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, మానవత్వం, న్యాయం వంటి ప్రాథమిక హక్కులను కల్పించిందని పేర్కొన్నారు.
జాతీయ జెండాలోని కాషాయ రంగు త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ సౌభాగ్యానికి, అశోక చక్రం ధర్మం మరియు న్యాయానికి ప్రతీకలని ఆయన వివరించారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారితో పాటు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్ వంటి మహానీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.
దేశ భవిష్యత్తు బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉందని, గణతంత్ర దినోత్సవం మరియు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాల గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చిదురాల మారేశ్వర రావు, గ్రామ ప్రథమ పౌరురాలు విషంపల్లి జ్యోతి, ఎంపీటీసీ సోనీ ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.jpeg)















Social Plugin