చాట్రాయిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి – 17 మంది అరెస్ట్, నగదు–వాహనాలు స్వాధీనం

ఏలూరు జిల్లా, నూజివీడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎస్.వి. ప్రసాద్ మార్గదర్శకంలో నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరంపై దాడి నిర్వహించారు.

ఈ దాడి చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, 01-01-2026 తేదీన బూరుగుగూడెం గ్రామ శివారులో జరిగింది. అక్కడ పేకాట ఆడుతున్న 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21,030 నగదు మరియు 19 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 01/2026గా, ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, జూద క్రీడలు వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. జూదాన్ని ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జూద కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.