కానిస్టేబుల్‌ శిక్షణకు బయల్దేరిన అభ్యర్థులు – సర్వీస్‌ భావంతో ముందుకు సాగాలని ఎస్పీ సూచన


ఏలూరు, డిసెంబర్‌ 20: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులను శిక్షణ నిమిత్తం శనివారం ఏలూరు అమీనా పేటలోని పోలీస్‌ కల్యాణ మండపం నుంచి సంబంధిత శిక్షణ కేంద్రాలకు పంపించారు. పురుష అభ్యర్థులు 129 మందిని అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీకి, మహిళా అభ్యర్థులు 60 మందిని విజయనగరం డీటీసీకి తరలించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివ కిషోర్‌ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. "మీరు ఇక నుంచి పోలీస్‌ ఫ్యామిలీలో సభ్యులుగా మారారని, తొమ్మిది నెలల శిక్షణను క్రమశిక్షణతో, నిబద్ధతతో పూర్తి చేయాలని తెలిపారు. పోలీస్‌ ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేయడమే ముఖ్యమని" అన్నారు.

ప్రస్తుత పోలీసు వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి విశేష ప్రాధాన్యం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్‌ క్రైమ్‌, ఐటీ కోర్‌ వంటి విభాగాలపై అవగాహన పెంచుకోవాలని, డ్రోన్‌ టెక్నాలజీ వంటి ఆధునిక అంశాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు అవసరమైన సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు.

వరదలు, అత్యవసర పరిస్థితుల్లో ముందుండి సేవ చేసే విభాగం పోలీసులేనని పేర్కొంటూ, ట్రైనింగ్‌ సమయంలో టీమ్‌ స్పిరిట్‌తో పనిచేయాలని, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. శిక్షణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా తెలియజేస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేక నోడల్‌ ఆఫీసర్‌ సహాయం అందిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌. సూర్య చంద్రరావు, పెదవేగి ట్రైనింగ్‌ సెంటర్‌ డీఎస్పీ సీహెచ్‌జీవీ ప్రసాద్‌, ఆర్‌ఐ సతీష్‌, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.