స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకు గ్రామస్థాయి నుంచి బలమైన స్పందన: మోర్సపూడిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు/నూజివీడు, డిసెంబరు 20: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నూజివీడు మండలం మోర్సపూడి గ్రామంలో ఘనంగా జరిగింది. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో చీపుర్లు పట్టి గ్రామస్తులతో కలిసి రహదారులను శుభ్రం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులు, విద్యార్థినులకు పరిసరాల పరిశుభ్రత, చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించిన అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమానికి మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు.

ఒక్కరోజు కార్యక్రమంతోనే మార్పు రాదని, క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించినప్పుడే స్థిరమైన ఫలితాలు సాధ్యమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఏటా సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని, వ్యాధులు వచ్చిన తరువాత చికిత్సలకంటే ముందే నివారణే ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయని తెలిపారు.

పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, డ్రైనేజీలలో మురుగు నీరు నిల్వలు కారణంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసర పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే వ్యాధులు దూరమవుతాయని, ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పరిశుభ్రత ప్రాధాన్యతను మనకు స్పష్టంగా నేర్పిందని గుర్తు చేశారు.

నూజివీడు నియోజకవర్గంలో శానిటేషన్ మెరుగుదల కోసం త్వరలో ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి వీధుల సంపూర్ణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.