ఏలూరు, డిసెంబరు 20: జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈ నెలకు “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో జిల్లా జాయింట్ కలెక్టర్ యం.జె. అభిషేక్ గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వాడవాడలా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, ప్రజలు కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా మారాలని, వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపద సృష్టించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించి, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. తడి, పొడి, హానికర వ్యర్థాల వేరు చేసే విధానం, ఈ-వ్యర్థాల సేకరణ, సురక్షిత రీసైక్లింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, చెట్ల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎన్.వి. నాంచారయ్య, సూపర్‌డెంట్లు, వివిధ విభాగాల రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin