అన్ని కేడర్ల ఉద్యోగుల సేవా వివరాలు డిజిటల్ రూపంలో — చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సందేశం


ఏలూరు జిల్లా, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులకు సంబంధించిన సేవా వివరాలను డిజిటల్ రూపంలో సమగ్రంగా నమోదు చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఉద్యోగులకు ప్రత్యేక సందేశం విడుదల చేశారు.


చైర్‌పర్సన్ మాట్లాడుతూ— “జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తమ సేవా వివరాలను Proforma–3 మరియు Google Form లింక్ ద్వారా నమోదు చేయడం అత్యంత అవసరం. ఈ సమాచారం వలన భవిష్యత్‌లో ఉద్యోగులకు అనేక లబ్ది చేకూరుతుంది. ముఖ్యంగా ప్రమోషన్లు, బదిలీలు, సీనియారిటీ లిస్టులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలలో వేగవంతమైన, పారదర్శక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డేటా ఎంతో సహకరిస్తుంది”.

ముఖ్యముగా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయములో రావలసిన బెన్ఫిట్స్ పొందడానికి  ఎంతగానో ఈ డేటా కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఉండడం వల్ల మరింత సులభ తరం అవుతుందని  చైర్‌పర్సన్ గారు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ భవిష్యత్ పరిపాలన డిజిటలైజేషన్‌లో ఇది ఒక కీలక అడుగు అని పేర్కొన్న ఆమె, అన్ని ఉద్యోగులు ఖచ్చితమైన వివరాలను సమయానికి నమోదు చేయాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు మరియు సంబంధిత A.Oలు  సిబ్బంది పాల్గొన్నారు.