ఏలూరు, డిసెంబర్ 20: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కల్పించేందుకు శనివారం ఏలూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సర్కిల్ కార్యాలయం, విద్యుత్ భవన్, ఆర్.ఆర్.పేట, ఏలూరు నుండి ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యవేక్షక ఇంజనీరు పి. సాల్మన్ రాజు మాట్లాడుతూ, ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం–2005 గురించి అవగాహన కలిగి ఉండి, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ చట్టం ద్వారా ఏ పౌరుడైనా ప్రభుత్వ శాఖల నుండి తమకు అవసరమైన సమాచారాన్ని పొందే హక్కు కల్పిస్తోందని తెలిపారు.
అలాగే, పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దిష్ట కాలవ్యవధిలో అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యతగా ఈ చట్టం పేర్కొంటుందని వివరించారు. సమాచార హక్కు చట్టం 2005లో అమలులోకి వచ్చి ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, గౌరవ జిల్లా కలెక్టర్, ఏలూరు వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేవలం కోర్టు ఫీ స్టాంపుతో పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని అర్జీ రూపంలో సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు సమర్పించి పూర్తి వివరాలు పొందవచ్చని తెలిపారు. నిర్ణీత సమయంలో స్పందన లభించని పక్షంలో అప్పీలేట్ అథారిటీని సంప్రదించే అవకాశం కూడా పౌరులకు ఉందని వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అప్పీలేట్ అథారిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కే.ఎం. అంబేద్కర్, టి. శశిధర్‌తో పాటు విద్యుత్ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.















Social Plugin