ఏలూరులో జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహణ


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు స్థానిక లేడీస్ క్లబ్‌లో కోటే శామ్యూల్, సజ్జి మాథ్యూస్, చిట్టిబాబు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై క్రిస్మస్ సందడిని పంచుకున్నారు.


వేడుకల ప్రారంభంలో కోటే శామ్యూల్ ప్రార్థన నిర్వహించగా, గాయని కమల క్రిస్మస్ గీతాలు ఆలపించి సభను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. అనంతరం ఏపీడబ్ల్యుజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎం.డి. జాబీర్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

దళిత నాయకులు సొంగా మధు మాట్లాడుతూ.. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం మాత్రమే కాకుండా, జర్నలిస్టులు ఐక్యంగా ఈ వేడుకలను జరుపుకోవడం శుభ సూచకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహోదరి బి. గీతాంజలి ప్రత్యేక గీతాలు ఆలపించి కార్యక్రమానికి మరింత శోభనిచ్చారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబి క్రిస్మస్ పాటలు పాడి ప్రసంగించారు. క్రీస్తును ఆరాధించడం అంటే మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడమేనని తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండటం యేసుక్రీస్తు బోధించిన గొప్ప త్యాగమని, ఆ గుణాలను మనసారా పాటించినప్పుడే మనం యేసుక్రీస్తుకు ఇష్టమైన బిడ్డలమవుతామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై ప్రభువు ఆశీస్సులు ఉండాలని కోరుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్య ప్రసంగీకులు రెవరెండ్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ.. పేదలకు సహాయం చేసి వారి ఆకలిని తీర్చడమే నిజమైన క్రీస్తు ఆరాధన, అదే నిజమైన క్రిస్మస్ అని అన్నారు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిని ఇచ్చెను” (యోహాను 3:16) అనే వాక్యాన్ని ఉదహరిస్తూ, క్రిస్మస్ కాలంలో మనం చేసే ప్రతి కార్యం క్రీస్తును మహిమపరిచే విధంగా ఉండాలని సూచించారు. దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబాలపై ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం జర్నలిస్టులంతా కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి, కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రసంగీకులు రెవరెండ్ శామ్యూల్ పాల్, ముఖ్య అతిథి మత్తే బాబిని జర్నలిస్టులు శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రామారావు, నారాయణ, ప్రతాప్, బి. క్రాంతి, యర్రా జయదాసు, అర్జున్, శ్రీనివాస్, వై.వి. హరీష్, కళ్యాణ్, ప్రేమ్ కుమార్, వెంకట్రావు, వీరఘట్టం జయరామ్, గుంపుల విక్టర్ తదితరులు పాల్గొన్నారు.