ఏలూరు, డిసెంబరు 20: పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న మన్యం బందుకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ. రవి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ప్రకటించి, పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చకపోవడం “నేతి బీరలో నెయ్యి లేనట్టే” ఉందని రవి విమర్శించారు. ఈ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు నిర్వాసితులవుతుండగా, వారికి బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాక చింతూరు రెవెన్యూ డివిజన్ నిర్వాసితులకు కూడా ఇదే ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్న పరిస్థితిలో, కేవలం రంపచోడవరం మాత్రమే జిల్లాగా ప్రకటించడం సరికాదని ప్రశ్నించారు.
రంపచోడవరం, పోలవరం ఎస్టీ నియోజకవర్గాలు రెండూ షెడ్యూల్డ్ ప్రాంతాలేనని, ఇక్కడ 1/70 చట్టం, పీసా చట్టాల అమలు జరుగుతున్నందున రెండింటిని కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన చట్టాల అమలుపై ప్రభుత్వ యంత్రాంగం మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రెండు ప్రాంతాలు వెనుకబడినవే కావడంతో సమగ్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు.
పోలవరం ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు చేపడుతున్న ఆందోళన న్యాయమైనదని పేర్కొన్న రవి, ఈ నేపథ్యంలో ఈ నెల 22న జరగనున్న మన్యం బందుకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ప్రజలందరూ ఈ బందుకు సహకరించి విజయవంతం చేయాలని, జిల్లాల పునర్విభజనలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను తప్పనిసరిగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.















Social Plugin