ఏలూరు, డిసెంబర్ 20: ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థుల్లో ఆరోగ్యకర జీవనశైలికి పునాది వేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల దిశగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగా ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ‘ముస్తాబు’ ద్వారా పాఠశాలల్లో వ్యక్తిగత, పరిసర పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు 28వ డివిజన్ ఖండ్రికగూడెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు పాఠశాలలకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచడంలో విద్యార్థులు తమ వంతు బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు.
ఈ పాఠశాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని ఇతర పాఠశాలల అవసరాలపై అంచనాలతో కూడిన వినతులు సమర్పించాలని ఏలూరు ఎంఈవో-2 అరుణ్‌కుమార్‌ను అక్కడికక్కడే ఆదేశించారు.
అనంతరం పాఠశాలకు ముస్తాబు సామగ్రిని అందజేసిన ఎమ్మెల్యే, విద్యార్థులతో కలిసి చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద సిద్ధం చేసిన పొంగలిని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు తరగతి గదులను స్వయంగా పరిశీలించి అవసరమైన సౌకర్యాలపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, మునిసిపల్ కమిషనర్ భాను ప్రతాప్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో క్లస్టర్ ఇంచార్జ్ ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.















Social Plugin