కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..


వెయ్యి కొబ్బరి కాయకు రూ.20 వేలు ధర ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం ఆధ్వర్యంలో కొబ్బరి రైతులు ఆందోళన..


ఏలూరు జిల్లా, పెదవేగి (విజయరాయి) డిసెంబర్ 5: కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వెయ్యి కొబ్బరి కాయలకు రూ.20 వేలు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం విజయరాయిలో కొబ్బరి రైతుల సంఘం ఆధ్వర్యంలో కొబ్బరి రైతుల సమావేశం నిర్వహించారు. అనంతరం కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్బంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కొబ్బరి కాయల ధరలు పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.కొబ్బరి వెయ్యి కాయలు  ధర రూ. 26 వేలు నుండి రూ.14వేలు, రూ.15 వేలు వరకు ధర పడిపోవడం వలన కొబ్బరి రైతులు నష్ట పోతున్నారని చెప్పారు.కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి ఎగుమతులు పెరగడంతో మన కొబ్బరి కాయలకు ధర పడిపోయినట్లు వ్యాపారులు చెప్పి ఇక్కడ కొబ్బరి కాయల ధరలు తగ్గించి వేయడం తగదన్నారు. 

ఒక్కసారిగా కొబ్బరి కాయల ధర తగ్గించడం మార్కెట్ మాయాజాలంతో రైతులను మోసగించడమేనని విమర్శించారు.కొబ్బరి రైతులు గత అనేక సంవత్సరాలుగా నష్టపోయారని, ధర పెరిగిందనే సంతోషం ఎంతో కాలం లేదన్నారు. 1000 కొబ్బరికాయలకు కనీస ధర రూ. 20వేలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కొబ్బరి రైతులను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, కార్యదర్శి బొల్లు రామకృష్ణ, కొబ్బరి రైతులు కోనేరు సతీష్ బాబు, గుదిబండి వీరారెడ్డి, కొండా విజయప్రసాద్, ఆలపాటి వాసు తదితరులు పాల్గొన్నారు.