ఏలూరు జిల్లా, నూజివీడు: నూజివీడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసు (ALO) ఎదుట భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పర్యవేక్షించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, IFTU అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మానికల నాగరాజు పాల్గొని మాట్లాడారు.
వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు ESI, PF వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి అని కోరారు. సంక్షేమ బోర్డు నుంచి ప్రభుత్వ అవసరాల పేరుతో తీసుకున్న నిధులను వెంటనే బోర్డుకు మళ్లి జమ చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సదుపాయం అందించాలన్నారు.
బాబు సర్కార్ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిర్మాణ కార్మికులకు ఉచిత పని పనిముట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు. నిర్వీర్యం అవుతున్న సంక్షేమ బోర్డును పునరుద్ధరించడానికి కార్మిక వర్గం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15న జిల్లా కలెక్టరేట్ వద్ద జరగబోయే మహా ధర్నాను నిర్మాణ కార్మికులు జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బి.సాయి, శివ సత్యనారాయణరాజు, సింహాద్రి, అర్జున్ రెడ్డి, అప్పారావు, నాగేశ్వరరావు, మురళి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin