ఏలూరు, డిసెంబరు 16: స్థానిక ఆదివారపు పేటలో మంగళవారం ఘనంగా కొనసాగుతున్న దక్షిణపు వీధి–పడమర వీధి త్రిదేవి పీఠం శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబు గార్ల జాతర మహోత్సవాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గం, వేద పండితులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి, జాతరలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అమ్మవార్ల కృప రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ మార్గంలో మరింత ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఏపీ వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దబోయిన వాణిశివ ప్రసాదు, ఏఎంసీ చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భాను ప్రతాప్, దేవాదాయ–ధర్మాదాయ శాఖ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ కిషోర్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కె. వాణిశ్రీ, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin