నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ఏలూరు జిల్లా పోలీసులు – ఫిర్యాదుదారుడి ఇంటి వద్దే చోరీ సొత్తు అప్పగింత


ఏలూరు, టి.నరసాపురం, జీలుగుమిల్లి, డిసెంబర్ 16: ఏలూరు జిల్లా పోలీసులు నూతన చట్టాలకు అనుగుణంగా వినూత్న విధానాన్ని అమలు చేస్తూ, దొంగతనం కేసులో పోయిన విలువైన సొత్తును ఫిర్యాదుదారుడి ఇంటి వద్దకే వెళ్లి అప్పగించారు. ఈ సందర్భంగా బాధితులు జిల్లా పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు, జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టి. నరసాపురం ఎస్‌ఐ జయబాబు తమ సిబ్బందితో కలిసి క్రైమ్ నెంబర్ 162/2025 కేసును ఛేదించారు. ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగతనానికి సంబంధించిన విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తులో 2.5 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నూతన చట్టాలకు అనుగుణంగా వేగవంతమైన ప్రక్రియను అనుసరించి, మంగళవారం (16.12.2025) ఎస్‌ఐ జయబాబు మరియు సిబ్బంది ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సొత్తును అప్పగించారు.

దొంగతనంలో పోయిన తమ ఆస్తి తిరిగి లభిస్తుందని ఊహించని ఫిర్యాదుదారులు, జిల్లా పోలీసుల సమర్థవంతమైన పనితీరుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. “ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు దయతో, వేగంగా స్పందించి మా ప్రాపర్టీని తిరిగి అందించారు. వారికి మేము రుణపడి ఉంటాం” అని వారు పేర్కొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించి ప్రజల్లో భరోసా కల్పించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు.