ఏలూరు, డిసెంబర్ 30: విజనరీ విధానాలు, పవర్‌ఫుల్ ప్లానింగ్‌లతో కూటమి ప్రభుత్వ పాలన సుస్థిరత దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఈ విధానాలు కీలకంగా మారాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. దార్శనీకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికాయుతమైన స్ఫూర్తి, యువనేత నారా లోకేష్ ఆధునిక టెక్నాలజీ ఆలోచనలు కలసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్రాన్ని కొత్త పుంతలపై నడిపిస్తున్నాయని ఆయన అన్నారు.
మంగళవారం ఏలూరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను బడేటి చంటి వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు చేసిన “సూపర్ సిక్స్” పథకాలు సూపర్ హిట్‌గా నిలిచి, అన్ని వర్గాల ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూర్చాయని తెలిపారు.
ముఖ్యంగా “తల్లికి వందనం” పథకం ద్వారా 67 లక్షల 27 వేల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లను నేరుగా చెల్లించి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రూ.1,144 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. అలాగే దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారికి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏ ప్రాంతంలోనైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించిందన్నారు.
అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 46 లక్షల మంది రైతులకు “అన్నదాత సుఖీభవ” పథకం కింద రూ.6,310 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిన అన్నా క్యాంటిన్లను పునరుద్ధరించి, రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటిన్ల ద్వారా ప్రతిరోజూ వేలాది మందికి భోజనం అందిస్తున్న ఘనత కూటమికే దక్కుతుందన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ మొత్తాలను పెంచి, ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటివరకు రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు, గత ఏడాదిలోనే రూ.33 వేల కోట్లను పెన్షన్ల రూపంలో అందించినట్లు బడేటి చంటి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, 5,757 మందికి కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు కల్పించి అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించి, రూ.1,000 కోట్లతో మరమ్మత్తులు, మరో రూ.3,000 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజల ప్రశంసలు అందుకున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ విశాఖలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్‌లో 610 ఒప్పందాలు కుదుర్చుకుని, రూ.13 లక్షల 25 వేల కోట్ల పెట్టుబడులను సాధించడంతో పాటు 16 లక్షల 13 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.
రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టి, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు డ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని, 2027 నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో జాతికి అంకితం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని బడేటి చంటి స్పష్టం చేశారు.
అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పథకాలు, కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి నూతన సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈయూడీఏ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు.















Social Plugin