జిల్లాలో రౌడీ షీటర్లపై కఠిన నిఘా – ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు


ఏలూరు, డిసెంబర్, 26: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలో నేరరహిత వాతావరణం నెలకొల్పడం, శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా సబ్ డివిజన్లకు చెందిన అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లాలోని రౌడీ షీటర్ల ప్రస్తుత డేటా, వారి కదలికలు, కార్యకలాపాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్షించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పాత నేరస్థులు మళ్లీ నేరాల బాట పట్టకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని, చట్ట నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఎటువంటి రాజీ లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కనిపిస్తే వెంటనే స్పందించి వాటిని నివారించాలని సూచించారు.

“ప్రజల భద్రతే పోలీస్ శాఖకు అత్యున్నత ప్రాధాన్యత. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. నేరగాళ్ల గుండెల్లో పోలీస్ శాఖ పట్ల భయం ఉండాలి” అని ఎస్పీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా, ఐటీ కోర్ ఇన్‌చార్జి నరేంద్ర, ఎస్సై రామకృష్ణతో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.