ఏలూరు, డిసెంబర్, 26: సాహిబ్‌జాదాల వీరోచిత త్యాగాన్ని స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వీర బాల్ దివాస్’ సందర్భంగా ఏలూరులో చిన్నారుల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. చిన్నారుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సదస్సు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డీసీపీఓ డాక్టర్ సూర్య చక్రవేణి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ యు. రవిచంద్ర గారి ఆదేశాల మేరకు ‘శక్తి టీం’ సభ్యులు పాల్గొని విద్యార్థులకు, చిన్నారులకు భద్రతా నియమాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై ప్రత్యేకంగా వివరించారు. చిన్నారులు తమకు తామే రక్షణ పొందేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను ఎలా గుర్తించాలో సరళంగా తెలియజేశారు. ఎవరికైనా అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాల్లో భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే ఆపద సమయంలో సంప్రదించాల్సిన ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. అత్యవసర సహాయానికి 112, సైబర్ నేరాలకు గురైతే 1930, చిన్నారుల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని వివరించారు.
చిన్నారులు దేశ భవిష్యత్తు అని, వారిని అన్ని రకాల వేధింపుల నుంచి కాపాడటం సమాజం మొత్తం బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. సాహిబ్‌జాదాల త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకుని, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని ఈ సందర్భంగా పిల్లలకు పిలుపునిచ్చారు.















Social Plugin