“చిన్నారినేత్రలు – సంరక్షణ” ఉచిత కళ్లజోళ్ల పంపిణీ


ఏలూరు, డిసెంబర్, 26: ఏలూరు మహాత్మ జ్యోతిభా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో, రాజ్యసభ సభ్యులు శ్రీ సాన సతీష్ బాబు ఫౌండేషన్ – ఏలూరు టీమ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన “చిన్నారినేత్రలు – సంరక్షణ” ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, చిన్నారుల కంటి ఆరోగ్యం భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని, గ్రామీణ ప్రాంతాలు మరియు సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం కీలకమని, ఈ దిశగా ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన చికిత్స మరియు కళ్లజోళ్లను అందించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మానేజ్మెంట్ సభ్యులు మారగాని చంద్ర కిరణ్, పాఠశాల సిబ్బంది, ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.